శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం, విశాఖపట్నం! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Thursday, December 14, 2017

శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం, విశాఖపట్నం!

శ్రీ కనక మహలక్ష్మి అమ్మవారు, బురుజుపేట, విశాకహపట్నం!
శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారు, విశాఖపట్నం.

ఉత్తరాంధ్రా ప్రజల కొంగుబంగారం! 

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మహలక్ష్మి దేవాలయాలు చాలా తక్కువ. ఉన్నవాటిలో చెప్పుకోతగిన దేవాలయం మన విశాఖపట్నం లోని "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం". ఉత్తరాంధ్ర ప్రజలు విరివిగా సందర్శించే "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం" విశాఖపట్నంలో జగదాంబజంక్షన్ కు అతి చేరువలోగల బురుజుపేట ప్రాంతం లో ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధించే దేవత "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు.

అప్పటి విశాఖపట్నం రాజావారి ఇలవేల్పు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు. రాజావారి కోటబురుజు వద్ద అమ్మవారు ప్రతిష్టింప బడ్డారు కాబట్టే ఆ ప్రాంతానికి "బురుజుపేట"గా పేరు పెట్టినట్లు తెలుస్తున్నది.


శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి చరిత్ర:

విశేషించి స్థల పురాణం ఏమీ లేకపోయినప్పటికీ స్థానిక కథనం ప్రకారం 1912 లో అప్పటికి బావిలో ఉన్న అమ్మవారిని బయటకు తీసి కోటబురుజు వద్ద ప్రతిష్టించారు. అయితే 1917లో రోడ్ల అభివృద్ధి నిమిత్తం అప్పటి స్థానిక మున్సిపల్ అధికారులు ఆటంకముగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగించి ఓ మూల (రోడ్ల విస్తరణకు ఆటంకం లేకుండా) పెట్టటం జరిగింది. ఇలా జరిగిన సంవత్సరంలో విశాఖపట్టణంలో ఎన్నడూ లేని విధంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈ మహమ్మారి ప్లేగు వ్యాధి అప్పట్లో వందల్లో విశాఖవాసుల్ని పొట్టనపెట్టుకుంది. స్థానికులు శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని స్థానభ్రంశం చేసి అపచారం చేయటం వలననే ప్లేగు మహమ్మారి ప్రబలిందని విశ్వసించారు. వెంటనే తొలగించిన "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారి విగ్రహాన్ని యధాస్థానంలో కోటబురుజు వద్ద పునఃప్రతిష్ట కావించారు. పిదప విశాఖపట్నానికి పట్టిన ప్లేగు మహమ్మారి కనుమరుగయ్యింది. అప్పటి నుండి అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలు శక్తి కొలది చేసే పూజలు అందుకుంటున్నారు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు.

శ్రీ కనమహలక్ష్మి అమ్మవారి వామహస్తాన్ని ఖండించిన పరమ శివుడు?

ప్రచారంలో ఉన్న మరొక కధనం ప్రకారం కలియుగ ప్రారంభంలో ఓ సద్బ్రాహ్మనుడు మోక్షం కోసం పరమశివునిలో ఐక్యమొందేందుకు కాశీ ప్రయాణమయ్యాడట. మార్గమధ్యంలో బురుజుపేట చేరుకోవటం పూజదికాదులు చేశుకోవటానికి అచ్చటే ఉన్న నూతిలో స్నానమాచారిస్తుండగా అమ్మవారి వాణి "కలియుగాన భక్తుల కోరిన కోర్కెలు తీర్చుటకు తాను వెలసినందున తనకు ప్రతిష్టాపన చేయమని" సెలివిచ్చినట్లు అందుకు బ్రాహ్మణుడు తాను కాశి పోవుటకు సమయము సరిపోనందున తిరస్కరించినట్లు, "శ్రీ కనక మహహల్క్ష్మి" అమ్మవారు కోపోద్రిక్తురాలై తన వామ హస్తములో గల ఆయుధంతో బ్రాహ్మణుని వధించేందుకు ప్రయత్నించగా, ఆ బ్రాహ్మణుడు పరమశివుని ప్రార్ధించి శరణు కోరెనట. పరమశివుడు ఉగ్రరూపురాలైన "శ్రీ కనకమహలక్ష్మి"ని శాంతింప చేసేందుకై అమ్మవారి వామ హస్తాన్ని మోచేతివరకు ఖండించారని కధనం.

శ్రీ కనమహలక్ష్మి ఆలయ విశిష్టత:

ఇచ్చటి అమ్మవారి ఆలయానికి ఇతర ఆలయాల వలె గోపురం లేక పోవటం ఒక విశేషం.  స్థానికులు గోపుర నిర్మాణం చేయ తలచిన ప్రతి సారి ఏదో ఆటంకం ఏర్పడుతుండటం వలన అమ్మవారికి గోపుర నిర్మాణం ఇష్టం లేదని నమ్మకం. అలాగే ఇక్కడ భక్తులే స్వయంగా అమ్మవారికి అభిషేకించటం ఆచారం. ఆలయంలో గల బావి (అమ్మవారిని బయటకు తీసిన బావి)చుట్టూ అష్టలక్ష్ముల చిత్రాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

మార్గశిర మాసంలో పోటెత్తే భక్తులు :

ముఖ్యముగా ఈ మార్గశిర మాసంలో భక్తులు విరివిగా శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అంతే కాకుండా మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మివారము/గురువారము అమ్మవారిని విశేషమైన పూజాధికాలు నిర్వహిస్తుంటారు. ఈ (లక్ష్మివారము/గురువారము) రోజుల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి పూజాధికాలు నిర్వహించి పరవశిస్తుంటారు. విశేషించి ఈ మాసంలో "శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి" మాలలను కార్తీకశుద్ద ఏకాదశి నుండి పుష్యశుద్ద పాడ్యమి మాలలు ధరించి  "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు దీక్షలు పూర్తిచేస్తుంటారు. శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి మాలలు ధరించువారు ఆకుపచ్చని వస్త్రాలను ధరించటం పరిపాటి.



శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం నిత్య పూజల మరియు సేవల పట్టిక
ఉదయం 5గం|| నుండి ఉదయం 6గం|| వరకు
పంచామృతాభిషేకం, సహస్రనామార్చన,
బాలభోగ నివేదన.
ఉదయం 6గం|| నుండి ఉదయం11గం|| వరకు
సర్వదర్శనం.
ఉదయం 11గం|| నుండి 11గం||30 ని|| వరకు
ఆలయ పరిశుబ్రత.
ఉదయం 11గం||30 ని|| నుండి మధ్యాహ్నం12గం|| వరకు
పంచామృతాభిషేకం, అష్టోత్తర సతనామార్చన,
స్వయం నివేదన.
మధ్యాహ్నం12గం|| వరకు నుండి సాయంకాలం 5గం||30 ని||
సర్వదర్శనం.
సాయంకాలం 5గం||30 ని|| నుండి సాయంకాలం 6గం|| వరకు
ఆలయ పరిశుబ్రత.
సాయంకాలం 6గం|| నుండి సాయంకాలం 6గం||30 ని||వరకు
పంచామృతాభిషేకం, అష్టోత్తర సతనామార్చన,
స్వయం నివేదన.
సాయంకాలం 6గం||30 ని|| నుండి ఉదయం 5గం||వరకు
సర్వదర్శనం
ప్రతి రోజు ఉదయం 7గం||| నుండి రాత్రి 9గం|| వరకు
కుంకుమార్చన.
ప్రతి శుక్రవారం ఉదయం 8గం||| నుండి రాత్రి 9గం|| వరకు
క్షీరాభిషేకం.

అన్న ప్రసాదం:


అమ్మవారి దర్శన నిమిత్తర్ధం వచ్చే భక్తులకు మధ్యహ్నం 12గం|| నుండి ఉచిత అన్న ప్రసాదం నిత్యానదన పధక సౌకర్యంతో కల్పిస్తున్నారు. "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారిని దర్శించుకొనే భక్తులు అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఈ పధకానికి "నిత్యాన్నదాన పధకం" క్రింద దేవస్తానం బోర్డుకు  విరాళాలను ఇస్తుంటారు.

రోడ్డు మార్గం :

దేశంలోనుంచి ఏ ప్రాంతం నుండైన "విశాఖపట్నం" (ఉక్కు నగరం) చేరుకోవటం సులభం. ముఖముగా మన తెలుగు రాష్ట్రాల నగరాలైన "హైదరాబాద్" మరియు "విజయవాడ"ల నుండి "విశాఖపట్నం"కి రాష్ట్ర రవాణా బస్సులతో పాటు ప్రైవేటు ఆపరేటర్ బస్సులు విరివిగా ఉన్నవి. "విశాఖపట్నం" చేరుకున్నాక సిటీ బస్సులలో కానీ, ఆటోలలో కాని చాల సులభంగా "శ్రీ కనకమహలక్ష్మి" అలయమున్న "బురుజుపేట" ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ట్రాఫిక్ అవరోధాలను అధిగమించగలిగితే కేవలం 15నిమిషాలలో దేవాలయానికి చేరుకోవచ్చును.

రైలు మార్గం:

దేశంలోనుంచి ఏ ప్రాంతం నుండైన "విశాఖపట్నం" రైల్వేస్టేషన్ చేరుకోవచ్చును. రైల్వే స్టేషన్ నుంచి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. సిటీ బస్సుల ద్వార లేదా ఆటోల ద్వార "శ్రీ కనకమహలక్ష్మి" అలయమున్న "బురుజుపేట" ప్రాంతాన్ని చేరుకోవచ్చు. అధిగమించగలిగితే కేవలం 20 నిమిషాలలో దేవాలయానికి చేరుకోవచ్చును.

విమాన మార్గం:

దేశంలోని ప్రధాన విమనాశ్రయలనుంచి "విశాకహపట్నం విమానాశ్రయానికి" చేరుకోవచ్చును. ఇచ్చటి నుండి ప్రైవేటు క్యాబ్స్ ద్వార "బురుజుపేట" ప్రాంతానికి చేరుకొని "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొనవచ్చును. విశాఖ విమానాశ్రయం నుండి బురుజుపేట "శ్రీ కనకమహలక్ష్మి" దేవాలయం సుమారు 18కి.మీ. దూరంలో ఉన్నది.

No comments:

Post a Comment