పంచారామాలు విశిష్టత! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Wednesday, November 1, 2017

పంచారామాలు విశిష్టత!

AMARAVATHI "SRI AMARALINGESWAR SWAMY"
పంచారామాల లో మొదటిదైన అమరావతి "శ్రీ అమరలింగేశ్వర స్వామి"

పంచారామాలు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రసిద్ది పొందిన శైవ క్షేత్రాలలో "పంచారామాలు" మొదటి స్థానంలో ఉన్నవి. శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం "కార్తిక మాసం". శివుని పంచారామాల్లో దర్శించుకొని అలౌకిక ఆధ్యాత్మిక తృప్తి, ఆనందం కోసం తెలుగు రాష్ట్రాలలోని భక్తులు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు.

పూర్వము హిరణ్యకశిప సంతతి వాడైన తారకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు శివుని కోసమై ఘోరమైన తపస్సు చేసి తనకు బాలుని తో తప్ప మరణము లేనట్లు వరం పొందెను. తారకాసురుడు నిత్యం తన మెడలో ఆత్మలింగాన్ని ధరించేవాడు. అంతే కాకుండా త్రిసంధ్యలలో శివారాధన చేస్తుండేవాడు. పైగా శివునితో పొందిన వరం. వీటి కారణంగా తారకాసురుడు గర్వితుడై విర్రవీగుతుండేవాడు. తన అసుర మూకలతో దేవతలపై దండెత్తుతూ వారిని ముప్పతిప్పలు పెడుతుండేవాడు.

దేవతలు తారకుసురుడు పెడుతున్న ఇబ్బందులను తాళలేక మహా విష్ణువు వద్దకు పోయి వేడుకున్నారు. శివపార్వతులు పుత్రునివలనే తారకాసురిని అంతం సంభవిస్తుందని మహా విష్ణువు వెల్లడించగా దేవతలు శివపార్వతులకు మొరపెట్టుకున్నారు. పిమ్మట సుబ్రహ్మణ్య స్వామి జన్మించి దేవా గణాధిపతిగా తారకాసురినిపై యుద్దానికి వెళ్తారు.

సుబ్రహ్మణ్య స్వామి తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా తారకాసురుని శరీరం ముక్కలు ముక్కలుగా పడి తిరిగి అతుక్కొని  బ్రతకతాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నిరుత్సాహపడుతున్న సుబ్రహ్మణ్య స్వామిని చూసి మహా విష్ణువు ప్రత్యక్షమై తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని చేధించమని సలహా ఇచ్చారు. అంతట సుబ్రహ్మణ్య స్వామి  తన ఆగ్నేయాస్త్రం ప్రయోగించి తారకసురిని మెడలో ఆత్మలింగాన్ని చేధించగా ఆత్మలింగం ఐదు ముక్కలుగా భూమిపై పడినది.

భూమిపై పడిన ఆ ఐదు ఆత్మలింగం ముక్కలు ఐదు శివాలయాలుగా దేవతలచే ప్రతిష్టించబడ్డాయి. అవే పంచారామాలుగా ఖ్యాతి పొందాయి.

1) అమరారామం: 

గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న ఈ  దివ్యక్షేత్రం "అమరారామం" గా భాసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు అమరేశ్వరుడుగా కొలువైవున్నారు. కృష్ణా నది తీరంలో ఉన్న పవిత్ర శైవక్షేత్రం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది. సుబ్రహ్మణ్య స్వామి ఆగ్నేయాస్త్రం కారణంగా ఐదు ముక్కలైన శివలింగంలోని తొలి భాగం అమరావతిలో పడింది. పడిన ఆ ముక్క మహా శివలింగముగా అవతరించింది. ఆ లింగాన్నే ఇంద్రుడు తన గురువైన బృహస్పతి సమక్షంలో ప్రతిష్టించారు. ఇచట ప్రతిష్టించబడిన శివలింగం "అమరేశ్వరుడు"గా ఖ్యాతి గడించినది.

అమరావతిలో కొలువై వున్న అమరేశ్వరుడు సుమారుగా 15 అడుగుల ఎత్తు కలిగిన శ్వేత(తెల్లని) శివలింగం భక్తులను పరవసింప చేస్తుంది. భక్తులు రెండవ అంతస్తు పైకి వెళ్లి శివలింగాన్ని దర్శించుకుంటారు. అర్చకులు రెండవ అంతస్తు నుంచే అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. భక్తులు అమరేస్వరుడిని దర్శించి ఆధ్యత్మికముగా అలౌకిక ఆనందాన్ని పొందుతారు.

"అమరేశ్వర" ఆలయంలో అమ్మవారు "శ్రీ బాల చాముండేశ్వరి దేవి"గా కొలువై భక్తుల పాలిట కొంగు బంగారమై ఉన్నారు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు.

ఈ ఆలయ అభివృద్దికి చాళుక్య, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాధిపతులు విశేష కృషి జరిపినట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు.

అమరారామం విజయవాడ నుండి 30కి.మీ. మరియు గుంటూరు నుండి 35కి.మీ.దూరములో ఉన్నది.

ఆలయ ప్రాంగణంలో గల ఇతర దేవాలయాలు :

ప్రాకరాల్లో కాశీవిశ్వనాధుడు, ఉమామహేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, జ్వాలాముఖి దేవి, వీరభద్ర స్వామి, వినాయక, కాలభైరవ, సూర్యనారాయణ స్వామి, కుమార స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు దర్శించతగ్గవి.

ఆలయదర్శన సమయాలు :
ఈ ఆలయము ఉదయము 5గంటల నుండి  రాత్రి 9 గంటల వరకు దర్శించుకొనవలెను.

2) ద్రాక్షారామం:

స్కంద ఖండితమైన శివలింగం రెండవ భాగము పడిన ప్రాంతమే "ద్రాక్షారామం". దక్షుడు యజ్ఞం తలపెట్టిన ఈ ప్రాంతాన్నే "దక్ష వాటిక" అని కూడా పిలుస్తారు. ద్రాక్షరామం దక్షిణకాశీ గా కూడా పేర్గాన్చింది. ఈ ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది. 

ఈ ద్రాక్షారామం అఖండ ఖ్యాతి గడించిన "పంచారామాల"లో రెండవది. అంతే కాకుండా "త్రిలింగ"  (1.కాళేశ్వరం, తెలంగాణ. 2.ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్, 3.శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్.) క్షేత్రాలలో కూడా రెండవది.  ఇక్కడి అమ్మ వారు మాణిక్యాంబ దేవి. అష్టాదశ శక్తి పీఠాలులో  12వ శక్తి పీఠముగా పేర్గాన్చింది.

అష్టాదశ శక్తి పీఠములు:

పరమేశ్వరుని భార్య సతీదేవి. సతీదేవి తండ్రైన దక్షప్రజాపతి యజ్ఞాన్ని దక్ష వాటికలో నిర్వహిస్తాడు. బ్రహ్మాది దేవతలకు పిలుపు చేసినప్పికీ తన కుమార్తె సతీదేవికి అల్లుడు పరమశివునకు ఆహ్వానించడు. అయినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞాన్ని చూడతలపించి పరమశివుని కూడా రమ్మని అర్ధిస్తుంది. పరమశివుడు తోడుగా రావటానికి నిరాకరించటంతో సతీదేవి దక్షవాటికకు బయలుదేరుతుంది. పిలవని పేరంటానికి విచ్చేసిన సతీదేవికి దక్షవాటికలో అవమానం ఎదురయ్యింది. జరిగిన అవమానానికి హృదయభంగమైన సతీదేవి తన బొటన వేలితో భూమిని రాపిడి చేసి అగ్నిని పుట్టించి తన దేహాన్ని దహించి వేసుకొంటుంది. 

కోపోద్రిక్తుడైన పరమశివుడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి, దక్షవాటికను నాశనం చేయమని అజ్ఞాపిస్తారు. వీరభద్రుడు శివాజ్ఞతో దక్షవాటికను నాశనం చేసిన పిదప, సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకొని విలయతాండవం చేస్తున్న శివుడిని శాంతింప చేయటానికి  మహావిష్ణువు తన సుదర్శన చక్రం తో సతీదేవి దేహాన్ని 18 ఖండాలుగా చేసారు. ఆ ఖండాలు పడిన ప్రదేశములే అష్టాదశ శక్తి పీఠములు.

ఎక్కడైతే సతీదేవి తన శరీరాన్ని దహించుకొంటుందో అక్కడే శివుడు భీమేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రమే ద్రాక్షరమంగా పేర్గాన్చింది.

స్వయంభూగా అవతరించిన "భీమేశ్వర స్వామి":

సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడ్ని వధింపగా తారకాసురిడి కంఠము నుండి పడిన శివలింగం 2వ భాగం ఈ ద్రాక్షారామంలో పడింది. పడిన స్వామివారి 2వ భాగాన్ని గోదావరి నదితో సంప్రోక్షణం చేసే ఉద్దేశ్యంతో సప్తఋషులు గోదావరి మాతను ప్రార్ధిస్తారు, గోదావరి మాత అంగీకరించి సప్తర్షులను అనుసరించెను. మార్గమధ్యములో గల రాక్షస ఋషుల ఆశ్రమాలు కొట్టుకుపోతాయి. అంతట ఆగ్రహించిన రాక్షస ఋషులు గోదావరి అదృశ్యమై పోవాలని శపిస్తారు. అంతట తుల్యుడనే రాక్షస మహర్షి సప్తర్షులకు, రాక్షసులకు మధ్యవర్తిత్వం చేసి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహింప చేస్తారు. సప్తరుషులచే తేబడిన కారణంగా గోదావరికి సప్తగోదావరిగా పిలువబడుతుంది. 

సప్తరుషులు గోదావరిని తేవడం అలశ్యమవటంతో బ్రహ్మాదిదేవతల కోరిక మేరకు భరద్వాజుడు నిశ్చయించిన ముహూర్తానికి పరమేశ్వరుడు "భీమేశ్వరుడు"గా స్వయంభూగా వెలిశారు. సూర్యభగవానుడు తొలి అర్చన చేశారు. 

అయితే స్థానికులు మాత్రం ఆలయాన్ని దేవతలు ఒక్కరోజులోనే నిర్మించారని, సూర్యభగవానుడు ప్రతిష్టించారని చెప్పుకొంటారు.

ద్రాక్షారామంలో కొలువైయున్న "భీమేశ్వర స్వామి" సుమారు 14అడుగుల ఎత్తైన శివలింగం. ఇక్కడ కూడా రెండవ అంతస్తు పైకెల్లి శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మి నారాయణ స్వామి. గోదావరి తీరంలోని సాయంకాలపు చల్లని గాలులను "భీమేశ్వర స్వామి" అస్వాదిస్తుంటారని ఆ సమయంలో భక్తుల కోరిన కోర్కెలను కాదనకుండా తీరుస్తుంటారని నమ్మకం. అయితే అభిషేకాదులు చేయదలచిన వారు తెల్లవారు దర్శన సమయంలోనే దర్సిన్చుకోవాల్సి ఉంటుంది. సాయంకాలాలలో అభిషేకాలు నిర్వహించరు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు.

అష్ట సోమేస్వరాలయాలు:

సప్తరుషులు గర్భగుడిలో ప్రవేసించబాగా గర్భాలయం వేడిగా ఉండుట చూచి ఆలోచనలో పడగా, ఆకశవాణి నుండి సూర్యభగవానుడు తొలి అర్చన చేసిన కారణంగా వచ్చిన వేడిని పారద్రోలటానికి గ్రామానికి ఎనిమిది దిక్కులలో సోమేశ్వర లింగాలను ప్రతిష్టించమని కోరగా అష్ట సోమేశ్వర దేవాలయాలను సూర్యునితో పాటు సప్తర్షులు అష్ట లింగాలను ప్రతిష్టించారు.

ఈ ద్రాక్షారామం రాజముండ్రి నుండి ద్వారపూడి మీదుగా సుమారు 44కి.మీ.దూరంలోను, కాకినాడ  నుండి 37కి.మీ.దూరంలోను ఉంది.

ఆలయ దర్శనసమయాలు:
ఈ ఆలయము ఉదయము 5.30నుండి 1.30గంటల వరకు తిరిగి సాయంత్రం 1.45గంటల నుండి 9 గంటల వరకు దర్శించుకొనవలెను.

3) కుమారరామం:

తారకాసురిని వధించిన కుమారస్వామియే ఈ స్థలములో పడిన ఆత్మ లింగం మూడవ భాగాన్ని ప్రతిష్టించారని నానుడి. అందుకే ఈ ఆరామాన్ని "కుమార రామం"గా పిలువబడుతున్నది. అమరారామం, ద్రాక్షారామం వలెనే ఇక్కడ కూడా శివలింగం రెండవ అంతస్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇచ్చటి లింగం స్పటిక లింగం. సుమారు 12అడుగుల ఎత్తు ఉంటుంది "కుమార రామం"లోని శివలింగం "శ్రీ కుమార లింగేశ్వర స్వామి"గా కొలువై ఉన్నారు.
ఇచటి అమ్మవారు "బాలత్రిపుర సుందరి".

"కుమారరామం" దివ్యక్షేత్రం సామర్లకోట (రైల్వే స్టేషన్కు 2కి.మీ.దూరము) లో ఉన్నది. ఇచ్చటి ఆలయ ప్రాకారాలు ద్రాక్షారామం పోలిన శిల్పకళావైభంతో ఉంటుంది. ఈ ఆలయం "కుమార భీమేశ్వరాలయం" గా కూడా పేర్గాన్చింది.  ఈ ఆలయాన్ని చాళుక్య రాజు "చాళుక్యభీమ"  సుమారు  9వ శతాబ్దపు చివరలో అభివృద్ధి చేసినట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి.

ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే చైత్ర, వైశాఖ (మార్చ్, ఏప్రిల్) మాసాలలో సూర్య కిరణాలు సూర్యోదయ సమయంలో స్వామి వారి పాదాలను, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పాదాలను తాకుతాయి.

ఆలయానికి తూర్పున ఉన్న కోనేరులో స్వామివారిని దర్శించే ముందు పాదాలను ప్రక్షాళన చేసుకోవాలి. ఈ కోనేరును భీమగుండమని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో 100 స్థంబాల మండపం ఉన్నది. ఈ మండపంలో పూర్వము యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించేవారని ప్రతీతి.

ద్రాక్షారామం నుండి కుమారరామం సుమారుగా 41కి.మీ.దూరములో ఉన్నది. మరియు రాజమండ్రి నుండి సుమారుగా 50కి.మీ.దూరములో ఉన్నది.

ఆలయదర్సన సమయాలు :
ఈ ఆలయము ఉదయము 5గంటల నుండి 11గంటల వరకు తిరిగి సాయంత్రం 4గంటల నుండి 8.30గంటల వరకు దర్శించుకొనవలెను.

4) క్షీరారామం:

పంచారామాలలో నాల్గవది "క్షీరా రామం". ఈ దివ్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా నర్సారాపురం సమీపాన కల పాలకొల్లులో కలదు. సుబ్రహ్మణ్య స్వామి చేదించిన శివలింగపు నాల్గవ భాగాన్ని సాక్షాత్తు మహావిష్ణువే  ప్రతిష్టాపన చేసారట. ఈ రామంలో "శ్రీ క్షీర రామలింగేశ్వరుడు" గా ఆ పరమశివుడు కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ మహా విష్ణువు.

ఈ క్షీరారామం పూర్వపు శాసనాల్లో క్షీరపురిగా పేర్గాన్చింది. నాటి క్షీరపురి నేటి పాలకొల్లుగా పిలువబడుతుంది.

పూర్వము "ఉపమన్యుడు" అనే బాలభక్తుడు కోరికమేరకు శివుడు తన త్రిశూలముతో నేలను త్రవ్వి పాలకొలను సృష్టించారని అందుకే "క్షీరారామం"గా పిలువబడుతోందని తెలుస్తోంది.

క్షీరారమంలో "శ్రీ క్షీరా లింగేశ్వర స్వామి" 2.5 అడుగుల తెల్లని లింగాకారంలో భక్తుల హృదయాలను పరవశింపచేస్తున్నారు. ఇచట పార్వతీదేవి "త్రిపురసుందరి"గా  భక్తుల పాలిట చల్లని తల్లిగా కొలువుతీరి ఉన్నారు.

ఈ అలయమండపం నైరుతి భాగంలో ఋణహరణ గణపతి ఆలయం ఉంది. భక్తులు తమ ఋణ బాధలు పోవాలని ఇచట పూజలు చేసి ఫలితం పొందుతుంటారు.

క్షీరారామంలో ప్రథమ ఆకర్షణగా గోపురం నిర్మాణం. ఈ గోపురం సుమారుగా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్తులతో కూడి ఉన్నది.

ఆలయదర్శన సమయాలు:
ఈ ఆలయము ఉదయము 5.30గంటల నుండి 11.30గంటల వరకు తిరిగి సాయంత్రం 4గంటల నుండి 8.30గంటల వరకు దర్శించుకొనవలెను.

5) సోమారామం :

గోదావరి ఉపనది గోస్తనీ తీరంలో పడిన శివలింగపు ఐదవ ఖండాన్ని చంద్రుడు "సోమేశ్వరుడు"గా ప్రతిష్టించారు. కావునే "సోమారామం"గా పేర్గాన్చింది. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినా గుణుపుడి గ్రామంలో ఉంది. ఈ అమృత లింగం చంద్రాకళాభాగామగుటచే ప్రతీ అమావాస్యకు కళాహీనముగా ఉండి తిరిగి ప్రతీ పౌర్ణమికి కళను సంతరించుకొనుట విశేషము. ఇచట శివుడు "సోమేశ్వర జనార్ధనస్వామి"గా మరియు పార్వతి "అన్నపూర్ణ దేవి"గా కొలువై ఉన్నారు.

ఈ క్షేత్రానికి "సోమగుండం" మరియు ఒక ఎత్తైన స్థంబం పైన నంది అశేనుడై భక్తులను ఆహ్వానిస్తుదుట విశేషము.

ఆలయదర్శన సమయాలు:
ఈ ఆలయము ఉదయము 5గంటల నుండి 11గంటల వరకు తిరిగి సాయంత్రం 4గంటల నుండి 8.30గంటల వరకు దర్శించుకొనవలెను.

రోడ్డు మార్గం :

పంచారామాలు దర్శించాలనుకొను భక్తులు కార్తికమాసంలో రెండు తెలుగు రాష్టాల జిల్లా ప్రధాన ఆర్.టి.సి. డిపోల నుండి  ప్రత్యేక బస్సు సౌకర్యం ఉపయోగించుకొనగలరు. లేదా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఆర్.టి.సి.వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ టికెట్లు కొనుక్కోవచ్చును.

రైల్ మార్గం :

ట్రైన్ ద్వారా ప్రయాణించ తలచినవారు విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లకు చేరుకొని పంచారామలకు ఎ.పి.ఎస్.అర్.టి.సి. బస్సుల ద్వారా తమ యాత్రలను పూర్తిచేసుకొన వచ్చును. పంచారామాల మధ్య విరివిగా బస్సు సౌకర్యం ఉంటుంది. లేదా ప్రైవేటు క్యాబ్స్ సౌకర్యం ఉంటుంది.

No comments:

Post a Comment